April 07, 2017

ASTHADASA PURANALU

వ్యాసభగవానుడు రచించిన 18 పురాణాలును అష్టాదశ పురాణాలుగా ప్రసిద్ధి చెందాయి.  అవి

1. మత్స్య పురాణం - మత్స్యావతారమెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది.

2. మార్కండేయ పురాణం - మార్కండేయ మహర్షి శివ విష్ణువుల మహాత్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్యములు మరియు సప్తశతి (దేవి మహత్యం) గురించి ఇందులో చెప్పారు.

3. భాగవత పురాణం: వేదవ్యాసుని వలన శుక మహర్షికి, శుకుని వలన పరీక్షిత్ మహారాజుకు 12 స్కందములలో మహా విష్ణు అవతారాలు, శ్రీ కృష్ణ జనన . లీలాచరితాలు వివరించబడినవి.

4. భవిష్య పురాణం: సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ఇందులో  ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం, భవిష్యత్ లో జరగబోవు విషయాలు ఇందులో వివరించబడ్డాయి.

5. బ్రహ్మ పురాణం:  దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. బ్రహ్మ చే దక్షునకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గురుంచి వివరించపడినది.

6. బ్రహ్మాండ పురాణం: బ్రహ్మ దేముడు మరిచి మహర్షికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరుశురామ, శ్రీరామచంద్రుల చరితలు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు. గాంధర్వం, ఖగోళ శాస్త్రం మరియు స్వర్గ నరకాల వివరణ ఇందు వివరించబడినది.

7. బ్రహ్మ వైవర్త పురాణం: సావర్ణునిచే నారదునికి చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త  బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గ, లక్ష్మి, సరస్వతి,, సావిత్రి, రాధా మొదలగు పంచ శక్తుల ప్రభావం గురించి వివరించబడినది.


8. వరాహ పురాణం: వరాహ అవతారమెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానం గురుంచి వివరముగా ఉన్నది. పరమేశ్వరి, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రములు,  వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఈ పురాణములో కలవు.

9.  వామన పురాణం:  పులస్త్య మహర్షి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, శివగణేశ,  కార్తికేయ చరిత్రలు, భూగోళం, ఋతు వర్ణనలు వివరించబడినవి.

10. వాయు పురాణం: ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్యం, కాలమానం,  భూగోళం, సౌర మండల వర్ణనలు చెప్పబడినది.

11. విష్ణు పురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది. విష్ణు మహాత్యం. శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపపడినవి.

12.  అగ్ని పురాణం: అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశా, దుర్గా భగవాదోపసన , వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లోకిక ధర్మాలు, రాజకీయాలు, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్యం మొదలగు విషయాలు చెప్పబడినవి.

13. నారద పురాణం: నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మ మానస పుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రం) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరి, ప్రయోగ, వారణాసి క్షేత్ర వర్ణనలు కలవు.

14.  స్కంద పురాణం: ఇది కుమారస్వామిచే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యం, ప్రదోష స్తోత్రములు, కాశీ ఖండం, కేదారఖండం. రేవా ఖండం(సత్యనారాయణ వ్రతం) , వైష్ణవ ఖండం (వేంకటాచల క్షేత్రం) , ఉత్కళ ఖండం (జగన్నాధ క్షేత్రం),  కుమారికా ఖండం (అరుణాచలం), బ్రహ్మ ఖండం (రామేశ్వర క్షేత్రం), బ్రహ్మోతర ఖండం (గోకర్ణక్షేత్రం, ప్రదోషపూజ), అవంతికఖండం (క్షిప్ర నది, మహాకాల మహాత్యము) మొదలగునవి కలవు.

15. లింగ పురాణం: ఇది శివుని ఉపదేశములు. లింగ రూప శివ  మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు, భూగోళ, జ్యోతిష్య, ఖగోళ శాస్త్రములు వివరించబడినవి.

16.  గరుడ పురాణం : ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశింపబడినది. శ్రీమహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావం, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణాలు తెలుపబడినవి.

17. కూర్మ పురాణం: కూర్మావతారమెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసింహ అవతారాలు,  లింగరూప శివారాధన, ఖగోళం, భూగోళములతో వారణాసి, ప్రయోగ క్షేత్ర వర్ణనలు తెలుపబడినవి .

18. పద్మపురాణం: ఇందులో జన్మాంతరాల నుంచి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగట్టకలిగేది ఈ పద్మపురాణం. పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియచేస్తుంది. మరియు మధుకైటభావధ, బ్రహ్మసృష్టి కార్యం, గీతార్థసారం - పఠన మహత్యం, గంగ మహాత్యం, పద్మగంధి దివ్య గాధ, గాయత్రి చరితం, రావి వృక్ష మహిమ, విభూది మహత్యం , పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధముగా ప్రవర్తించాలో పద్మపురాణములో వివరంగా తెలియచేయపడినది.No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0